కురుమూర్తి ఘాట్‌ రోడ్డు పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

కురుమూర్తి ఘాట్‌ రోడ్డు పూర్తిచేస్తాం

Sep 21 2026 1:26 AM | Updated on Sep 21 2026 1:26 AM

పాలమూరు గుండెకాయ..

ఉదండాపూర్‌ ప్రాజెక్ట్‌ భూ సేకరణకు రూ.560 కోట్లు మంజూరు

బ్రహ్మోస్‌ భూ సేకరణలో రైతులకు న్యాయమైన పరిహారం

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

దేవరకద్ర/ చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆలయం వద్ద చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకద్ర మండలం మీనుగోనిపల్లి వద్ద నియోజకవర్గంలో రూ.153 కోట్లతో చేపడుతున్న పలు రహదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎస్పీ జానకితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న ఘాట్‌ రోడ్డు నిర్మాణం పనుల రోడ్డు మ్యాపును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.110 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2027 జూలై నాటికి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్‌, కర్వెన ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి.. త్వరలోనే కృష్ణానీటితో నింపుతామన్నారు. ఉదండాపూర్‌ భూ సేకరణకు ప్రభుత్వం రూ.560 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రాజెక్టులు నిండలేదని, నదులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయని పేర్కొన్నారు. తాగడానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని నిల్వ చేస్తున్నామని, ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బ్రహ్మోస్‌ కోసం సేకరిస్తున్న భూములకు తగిన నష్టపరిహారం ఇవ్వడంతోపాటు రైతులకు న్యాయం చేస్తామన్నారు.

● ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రి, వివిధ కార్యాలయాల భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిందని, పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దమయంతి, కురుమూర్తి స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ బాలరాజు, మాజీ చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి, ముచ్చింతల సర్పంచ్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు పాలమూరు గుండెకాయ లాంటిదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాబోయే వేసవిలో పాలమూరు ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయనే ఉద్దేశంతోనే పంటలకు నీటిని వదలడం లేదన్నారు. అయితే రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇదే సందర్భంలో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు. అయితే వాతావరణ పరిస్థితులను ఆసరాగా చేసుకొని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులను రెచ్చగొట్టి జూరాల ప్రాజెక్టుపై ధర్నా చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు గేట్లను పగులగొట్టి నీటిని వృథా చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి చర్యలు సరికాదని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement