● కోస్గి పాంచజన్య సంకల్పసభలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత
కోస్గి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయి రెండు ప్రభుత్వాలు ఏర్పడినా.. ఉమ్మడి పాలమూర్ జిల్లాలో నేటికీ సాగునీటి గోస తప్పలేదని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యమనే నినాదంతో ఆదివారం కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. బిడ్డల గోస తల్లికే తెలుస్తుందని.. ఓ తల్లిగా రాజకీయ పార్టీ పెట్టి మీ ముందుకొచ్చానని, పార్టీ పెట్టడం గిట్టని కొందరు బీఆర్‌ఎస్ వదిలిన బాణం అని, మరికొందరు రేవంత్ వదిలిన బాణమని, తలకాయలేని మరికొందరు బీజేపీ వదిలిన బాణమంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరు వదిలిన బాణం కాదని.. నేటికీ విద్య, వైద్యానికి నోచుకోని బహుజనులు వదిలిన బాణన్నని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని.. సీఎం సొంత నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు కమీషన్లు వసూలు చేస్తున్నారని, ఉమ్మడి పాలమూర్ జిల్లా నుంచి గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి దందాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500, రైతు భరోసా, రైతుబీమా, పింఛన్లు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు ఏడాదికి రూ.4 వేల కోట్ల నిధులని చెప్పి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో కేవలం రూ.1,500 కోట్లు ఇచ్చారని, ఈ విషయం మంత్రి అజారుద్దీన్ అసెంబ్లీలో చెప్పడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమన్నారు. సీఎం బంధువులు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు లగచర్ల రైతులపై దాడులు చేసి భూములు లాక్కున్నారని.. హోంశాఖ నిర్వహిస్తున్న సీఎం ఈ విషయంలో పేదలకు సామాజిక న్యాయం ఎక్కడ చేశారని ప్రశ్నించారు. వ్యవసాయానికి విద్యుత్, యూరియా లేదని, కోస్గికి ఇచ్చిన ఇంజినీరింగ్ కళాశాలను తరలించారని, ఏ పాఠశాల, కళాశాలలో పూర్తిస్థాయి బోధకులు లేరని, సీఎం సొంత ఇలాఖాలో 47 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయని, విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఆ శాఖకు న్యాయం చేయలేకపోయారన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతలో వెనుకబడ్డ గట్టు, కేటీదొడ్డి మండలాలు సీఎం సొంత జిల్లాలో ఉండటం శోచనీయమని.. విద్య, శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. కేబినెట్‌లో నేటికీ గిరిజనులకు అవకాశం ఇవ్వలేదని.. మొన్నటి వరకు ముస్లింలకు సైతం లేదని నిలదీస్తే అజారుద్దీన్‌కు అవకాశం ఇచ్చారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని తెలిపారు. అందరూ ఆశీర్వదిస్తే తెలంగాణలో సైతం మాతృస్వామ్య పాలన చేపడతామని చెప్పారు.


