● ఇన్సులిన్ లేకపోవడంపై వైద్యాధికారులపై కలెక్టర్ ఆగ్రహం
పాలమూరు: కోయిలకొండ మండలంలో మంగళవారం పర్యటించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను తనిఖీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది హాజరు, పిటిషన్లను పరిశీలించి పెండింగ్ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సీహెచ్‌సీని సందర్శించి వైద్య సేవలు, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులతో మాట్లాడగా ఐరన్ మాత్రలు, ఇన్సులిన్ అందుబాటులో లేవని వారు తెలిపారు. దీంతో ఇన్సులిన్ స్టాక్ వెంటనే తెప్పించాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించగా.. మహబూబ్‌నగర్ నుంచి మందులు పంపించారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం బీసీ బాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసి ఆహార సరుకులు, విద్యార్థులకు అందుతున్న అల్పాహారం, భోజనంపై ఆరా తీశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, పనిచేయని ఫ్యాన్లను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. బూర్గుపల్లి సర్పంచ్ ప్రస్తావించిన చెక్కుల సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధనుంజరావు ఇతర అధికారులుపాల్గొన్నారు.


