● 17న తండాల్లో కార్యక్రమాలు: లక్ష్మారెడ్డి
జడ్చర్ల: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఈనెల 17న జిల్లాలోని అన్ని తండాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంగళవారం జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్‌లో ఆయన మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని తెలిపారు. తాగునీరు, రహదారుల కల్పనతో తండాల రూపురేఖలు మార్చామని, గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని అన్నారు.
ఎమ్మెల్యేపై విమర్శలు
స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మారెడ్డి విమర్శించారు. భూ కబ్జాలకు సంబంధించి ఒక్క గజం అక్రమాన్ని కూడా నిరూపించలేదన్నారు. రంగారెడ్డిగూడ దేవాదాయ భూములు, జడ్చర్ల భూదాన్ భూమి, బాదేపల్లి నల్లకుంట ఎఫ్‌టీఎల్ ఆక్రమణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి విషయంలో తాము సహకరిస్తామని, అర్థం లేని ఆరోపణలు మానుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ లక్ష్మినాయక్, నాయకులు నందకిషోర్, రామ్మోహన్, మురళి, లత, ప్రణీల్ ,శ్రీనివాస్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


