జడ్చర్ల: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల ను భాగస్వామ్యం చేస్తూ.. వాటిని వారికి వివరించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులను కలిసి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజల్లో మరింత విశ్వాసం పొందాలన్నారు. భవిష్యత్‌లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మిథున్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రబ్బానీ, అశోక్‌యాదవ్, వంశీచారి పాల్గొన్నారు.


