● మైనర్ బాలికకుప్రేమ పేరుతో వేధింపులు
మహబూబ్‌నగర్ క్రైం: అర్ధరాత్రి నడిరోడ్డుపై నవజాత శిశువును వదిలివేసిన ఘటనలో బాలిక తల్లి, తండ్రి, బాబాయిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం సీఐ ఇజాజుద్దీన్ వెల్లడించారు. కోయిలకొండ మండలానికి చెందిన మైనర్ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. 8వ తరగతి నుంచే గార్లపాడ్‌కు చెందిన సెట్రింగ్ కూలీ ఆనంద్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో అతడు బాలికను మోసం చేయడంతో గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక 9 నెలల పాటు తల్లిదండ్రులకు చెప్పకుండా దాచింది. సెప్టెంబర్ 4న అర్ధరాత్రి కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆటోలో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అంబేద్కర్ చౌరస్తా–న్యూటౌన్ మధ్యలో ప్రసవమై మగ శిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో తల్లి, తండ్రి, బాబాయి కలిసి శిశువును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎదుట రోడ్డుపై వదిలేసి బాలికను గ్రామానికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు నిందితులను గుర్తించారు. బాలిక తల్లి, తండ్రి, బాబాయిను అరెస్టు చేశారు. ఆనంద్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కేసును భరోసా కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. మైనర్ బాలికలు ప్రేమ పేరుతో మోసపోయి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోరాదని సూచించారు. సమావేశంలో ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు, ఏఎస్‌ఐ సాయి నిర్మల దేవి, సిబ్బంది శేఖర్, అశోక్, కురుమూర్తి పాల్గొన్నారు.


