● భారీ గణనాథులు బీచుపల్లికి
తరలించేలా ఏర్పాట్లు
● చెరువులు పరిశీలించిన
కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి
పాలమూరు: వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలోని చెరువుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా విగ్రహాలు నిమజ్జనం కోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా వెల్లడించారు. పంచవటి పాఠశాల సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన కృత్రిమ బేబీ పాండ్‌తోపాటు పాలకొండ చెరువు, శ్రీనివాసకాలనీ, అప్పన్నపల్లి, చిన్నదర్పల్లి చెరువులను శుక్రవారం కలెక్టర్ ఎస్పీ జానకితో కలిసి పరిశీలించారు. అప్పన్నపల్లి చెరువు వద్ద ఎక్కువ వినాయక విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున రెండు పెద్ద బేబీ పాండ్లు నిర్మించాలన్నారు. నిమజ్జన కేంద్రాల దగ్గర విద్యుద్దీపాలు, బారీకేడ్లు, పారిశుద్ధ్య చర్యలు, తాగునీరు తదితర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం అనంతరం విగ్రహాల అవవేషాలు, పూజా సామగ్రి, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను వెంటనే తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. ప్రతి బేబీ పాండ్ దగ్గర నిరంతరం పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. నగరం నుంచి వెళ్లే భారీ గణనాథులను బీచుపల్లిలో నిమజ్జనం చేసేలా గద్వాల కలెక్టర్‌ను కోరగా సానుకూలంగా స్పందించినట్లు కలెక్టర్ చెప్పారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచోసుకోకుండా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సాయిశివాని, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, కమిషనర్ రామాంజులరెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి పాల్గొన్నారు.
● మండపాల వివరాలను https://policeportal .tspolice.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, నిబంధనలకు లోబడి వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్‌స్టేషన్, నిమజ్జనం చేసే తేదీ, ప్రదేశం నిమజ్జనానికి వినియోగించే వాహనం తదితర సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు.


