మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో హాస్టల్ డిపాజిట్ ఫీజు (మెస్) ను తగ్గించాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పీయూ రిజిస్ట్రార్ పి.రమేష్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది బీసీలు బాలురకు రూ.12,100, బాలికలకు రూ.19,100, ఎస్సీ, ఎస్టీలు బాలురకు రూ.11,100, బాలికలకు రూ.9,100, ఓసీలు బాలురకు రూ.18,100, బాలికలకు రూ.16,109 ఉండేదన్నారు. ఈ ఏడాది నుంచి రిజర్వేషన్లతో సంబంధం లేకుండా బాలురకు రూ.18,000, బాలికలకు రూ.16,100 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇంత మొత్తం చెల్లించలేరని రూ.12 వేలకు తగ్గించాలన్నారు.
నేడు జిల్లా కోర్టులలో
జాతీయ లోక్ అదాలత్
పాలమూరు: జిల్లాలోని మూడు కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర కోర్టుల్లో కలిపి ఏడు బెంచీల్లో ఉదయం 10 గంటల నుంచి కేసుల పరిష్కారం ఉంటుందన్నారు. లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని వారి కేసులు రాజీ చేసుకోవాలని సూచించారు.
తగ్గిన లడ్డు పరిణామం.. కేసు నమోదు
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో శుక్రవారం తూనికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. లడ్డు పరిమాణం తక్కువగా ఉందని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా తూనికల జిల్లా అధికారి రవీందర్ మాట్లాడుతూ లడ్డూల తయారీలో అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తులకు అందించే లడ్డు పరిమాణం 100 గ్రాములకు గాను 80 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.


