మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, నిర్వహణపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలకే పరిమితమైన హైమాస్ట్ లైట్లు.. ప్రస్తుతం పలు డివిజన్‌లలో అవసరం ఉన్నా లేకున్నా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ విద్యుత్ స్తంభాలకు లైట్లు ఉన్నప్పటికీ అదనంగా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడంతో కార్పొరేషన్‌పై నిర్వహణ భారం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్ విద్యుత్ విభాగానికి చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.13 కోట్లకు చేరినట్లు సమాచారం. మరోవైపు హైమాస్ట్ లైట్లు, బోర్ల నిర్వహణకు నెలకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నిర్వహణ, విద్యుత్ బిల్లులు కార్పొరేషన్‌కు భారంగా మారాయి.
బోర్లూ.. భారమే
మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ పలు డివిజన్‌లలో అదనంగా బోర్లు, పంప్‌సెట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో నెలకు 20 నుంచి 30 వరకు బోర్లు పాడవుతుండటంతో మరమ్మతుల కోసం ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. బోర్ల నిర్వహణ, మరమ్మతులు, విద్యుత్ బిల్లులకు కలిపి నెలకు రూ.15–20 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం.
ఎవరు చెప్పారు.. ఎందుకు వేశారు?
అవసరం ఉన్నా లేకున్నా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పూర్తి వివరాలతో నివేదిక రూపొందించేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 60 డివిజన్‌లలోని ప్రతి హైమాస్ట్ లైట్ వివరాలను సేకరించనున్నారు. ఎవరి సూచనతో ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు? ఎక్కడి నుంచి ప్రతిపాదన వచ్చింది? అనే అంశాలను పరిశీలించనున్నారు. వార్డు అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం (నేడు) నుంచి లైట్ల వద్ద సోషల్ సర్వే నిర్వహించి, సమీపంలోని ఇళ్ల యజమానుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు సమాచారం. సర్వే పూర్తయితే హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వెనుక అసలు పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ విషయం మాట్లాడేందుకు కార్పొరేషన్ కమిషనర్ రామాంజులారెడ్డి సంప్రదించగా.. ఆయన స్పందించలేదు.
2 వేలకుపైగా హైమాస్ట్‌లు
కార్పొరేషన్‌లోని 60 డివిజన్‌ల పరిధిలో 2 వేలకుపైగా హైమాస్ట్ లైట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రతి నెలా సుమారు 100 నుంచి 150 వరకు బల్బులు, హెచ్‌క్యూలు, వైర్లు తదితర పరికరాలు పాడవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలోనే పెద్ద సంఖ్యలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇటీవల ఏర్పాటు చేసిన కొన్ని లైట్లు సైతం పనిచేయడం లేదని, వాటికి వారంటీ, గ్యారంటీ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అవసరం లేకున్నా.. ఇష్టానుసారంగా ఏర్పాటు
కార్పొరేషన్ పరిధిలో 2 వేలకుపైగా లైట్లు
రూ.13 కోట్ల కరెంట్ బకాయిలు.. నెలకు రూ.40 లక్షల ఖర్చు
‘హైమాస్ట్’లు ఎందుకు ఏర్పాటు చేశారనే దానిపై నేటి నుంచి సోషల్ సర్వే


