నాగర్‌కర్నూల్: కరెంట్ కష్టాలు రైతులకే కాదు.. ఏకంగా సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సైతం మొదలయ్యాయి. రాత్రివేళ మూడు రిజర్వాయర్ల వద్ద నీటిని ఎత్తిపోసే పంపుసెట్లు ఆపేయాలని.. ఉదయం వేళ నడపాలని ఎస్‌ఎల్‌డీసీ (స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్) నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయి. ఈ మేరకు తప్పని పరిస్థితుల్లో కొన్ని రిజర్వాయర్ల వద్ద రాత్రివేళ పంపులను ఆపేసి.. మరికొన్ని చోట్ల ఒక పంపుసెట్ నడుపుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగు, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితంగా కాల్వల నీటిని నమ్ముకొని పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది.
మూడు రిజర్వాయర్లు..
కేఎల్‌ఐ పరిధిలో నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రేగుమాన్‌గడ్డ వద్ద ఎల్లూరు రిజర్వాయర్‌కు నీరు ఎత్తిపోస్తారు. అక్కడ ఐదు పంపుసెట్లకు గాను ప్రస్తుతం రెండు మరమ్మతుకు గురవగా మూడు నడుస్తున్నాయి. ఎల్లూరు నుంచి సింగోటం గ్రావిటీ మీదుగా జొన్నలబొగుడకు ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐదు పంపులు ఉండగా మూడే నడుపుతున్నారు. గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కేఎల్‌ఐ కాల్వలకు వదులుతారు. గ్రావిటీ మీద నీరు పారుతుండగా ప్రధాన కాల్వ 160 కి.మీ., కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి మరో 60 కి.మీ., మాడ్గుల మండలం నాగిళ్ల వరకు టెలెండ్ కాల్వ వెళ్తుంది.
13 గంటలకు కుదింపు..
ప్రస్తుతం విద్యుత్ సమస్య తీవ్రమైంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి 18 నుంచి 13 గంటలకు కుదించారు. అయితే వాస్తవ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. పది గంటలే సరఫరా అవుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సమస్య కేఎల్‌ఐ పంపుసెట్లకు తాకడం ఆందోళనకరం. ఎస్‌ఎల్‌డీసీ (లోడ్ డిస్పాచ్ సెంటర్) విద్యుత్ వాడకంపై నియంత్రణ విధిస్తున్నారు. మూడు రోజుల నుంచి కేఎల్‌ఐ పంపుసెట్ల విద్యుత్ వాడకంపై నియంత్రణ చేయాలని, రాత్రివేళ నిలిపివేయాలని సూచిస్తున్నారు. సాయంత్రం 7 నుంచి ఉదయం 8 గంటల వరకు నిలిపివేస్తే లోడ్ కంట్రోల్ చేయవచ్చని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైంది. వరిసాగు వద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు విస్తృత ప్రచారం చేసినా.. కేఎల్‌ఐ సాగునీరు విడుదలతో రైతులు వరిసాగుకే మొగ్గుచూపారు. ప్రస్తుతం కేఎల్‌ఐ కాల్వలో పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. అది కూడా ఎప్పుడు ఆగిపోతాయోనని, చివరికి పంటలు చేతికి వస్తాయో.. లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తీవ్రమైన విద్యుత్ కోతలతో కేఎల్‌ఐ పంపింగ్‌కు ఆటంకాలు
జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల వద్ద మోటార్ల నిలిపివేత
ఎస్‌ఎల్‌డీసీ సూచన మేరకు రాత్రివేళ నిలుపుదల
సాగు, తాగునీటి సరఫరాపై ప్రభావం చూపే అవకాశం


