బ్రహ్మోస్‌ భూసేకరణలో రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోస్‌ భూసేకరణలో రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యం

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

సాధ్యమైనంత మెరుగైనపరిహారం అందిస్తాం: కలెక్టర్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): బ్రహ్మోస్‌ ప్రాజెక్టుతో జిల్లాకు పారిశ్రామికంగా కొత్త ఊపు రానున్న నేపథ్యంలో.. భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యమిస్తామని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా స్పష్టం చేశారు. చట్ట నిబంధనల మేరకు సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించేలా భూసేకరణ చేపడతామని తెలిపారు. దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో బ్రహ్మోస్‌ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణపై గురువారం కలెక్టరేట్‌లో నెగోషియేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులు, సర్పంచ్‌, ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌ చర్చించారు. భూముల ప్రస్తుత మార్కెట్‌ విలువ, పరిహారం, రైతుల జీవనోపాధి, భవిష్యత్‌ ప్రయోజనాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘‘మీ భూములకు ఎంత పరిహారం ఆశిస్తున్నారు? మీ అభిప్రాయాలు, అభ్యంతరాలను స్పష్టంగా తెలియజేయండి’’ అని రైతులను కోరారు. ప్రస్తుత మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని మెరుగైన పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. భూమికి బదులుగా భూమి కేటాయించడంతోపాటు తగిన పరిహారం అందించాలని, భూములు కోల్పోయిన తర్వాత జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోస్‌ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమ జిల్లాకు రావడం గర్వకారణమని సర్పంచ్‌ శివకుమార్‌ అన్నారు. ప్రాజెక్టుపై గ్రామస్తులు సంతోషంగా ఉన్నప్పటికీ.. భూములు కోల్పోయే రైతుల విషయంలో ఆందోళన ఉందని గ్రామ ప్రతినిధి శ్రీనివాస్‌ తెలిపారు.

సర్వే వివరాలు పక్కాగా ఉండాలి

భూసేకరణ సర్వేలో భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, పట్టా భూములు, కబ్జా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వివరాలపై రైతులకు అభ్యంతరాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. రైతులు, ప్రజాప్రతినిధులు మరోసారి గ్రామస్థాయిలో సమావేశమై భూముల ప్రస్తుత ధరలు, వాస్తవ పరిస్థితులు, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణాత్మక ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. ప్రాజెక్టు అభివృద్ధి, రైతుల ప్రయోజనాలను సమన్వయం చేస్తూ భూసేకరణను పారదర్శకంగా, న్యాయబద్ధంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, ఆర్‌డీఓ నవీన్‌, సర్పంచులు, రైతులు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement