● పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి
● గణపతి ఉత్సవాల్లో కట్టుదిట్టంగా బందోబస్తు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్‌స్టేషన్ వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులకు అధిక ప్రాధన్యత ఇచ్చి దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ డి.జానకి అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశం మందిరంలో గురువారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీటీఎన్‌ఎస్‌లో కేసుల వివరాలు, రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. మాదకద్రవ్యాలు, సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలన్నారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. సైబర్ నేరాల కట్టడిలో భాగంగా నిరంతరం అవగహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. ప్రధానంగా దొంగతనం కేసుల్లో నేరస్తులను సకాలంలో గుర్తించి సొమ్ము రికవరీ చేయాలని సూచించారు.మహిళలు, అమ్మాయిలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి గ్రామంతో పాటు పట్టణం, మండలకేంద్రాల్లో ఉండే ప్రధాన కూడళ్లు, వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చైతన్యం చేయాలన్నారు. ఈ నెల 14 నుంచి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ఆయా స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని మండపాలపై నిఘా పెట్టాలని, రాత్రి వేళ గస్తీ పెంచాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బాలాజీ, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్, కమలాకర్, రాజేందర్‌రెడ్డి, క్రిష్ణ, మోతీరాం, రామకృష్ణ, రవిబాబు, మహేష్, నర్సింహులు, ఎస్‌హెచ్‌ఓలు, ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.


