● ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డా.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్లలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీలోకి రాకుండా చేయాలనే కుట్రతోనే గేటు వద్ద పోలీసులు రాద్ధాంతం సృష్టించారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు దురుసుగా వ్యవహరించిన ఘటనపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఫేక్ ఫొటోల ఆధారంగా కేసులు పెడుతున్నారని, తమ ఎమ్మెల్యేల తప్పేమీ లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చిన సీఎం, మంత్రులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


