● మహమ్మదాబాద్‌లో ఏడు క్లినిక్‌ల సీజ్
● ఇద్దరు ఆయూష్, ఐదుగురు ఆర్‌ఎంపీలపై చర్యలు
● జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
పాలమూరు/మహమ్మదాబాద్: వారు ఎంబీబీఎస్ కాదు.. ఎండీలు కాదు.. కానీ వారికి ఏమాత్రం తక్కువ కాదంటూ అర్హత లేకపోయినా వైద్యంచేస్తూ, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్‌ఎంపీలపై జిల్లా వైద్యారోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. గురువారం డీఎంహెచ్‌ఓ డా.శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహ్మదాబాద్‌లోని ఆర్‌ఎంపీల క్లినిక్‌లలో చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఇద్దరు వ్యక్తులు హోమియో, యునాని వైద్యవిద్యం అభ్యసించి ఆయూష్‌లో క్లినిక్ రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపించి.. ఏకంగా అల్లోపతి వైద్యంతో ప్రసవాలు, సర్జరీలు చేసే విధానాలు చూసి డీఎంహెచ్‌ఓ బృందం ఆశ్చర్యానికి లోనయ్యారు. మరో ఐదుగురు ఆర్‌ఎంపీలు ఎలాంటి అనుమతి లేకపోయినా ప్రత్యేకంగా క్లిని
క్‌లు ఏర్పాటు చేసుకొని వాటిలో మూడు, ఐదు ఇలా పడకలు ఏర్పాటుచేసి వైద్యం చేస్తున్నారు. వారు వైద్యుల మాదిరిగా యాంటీబాయాటిక్స్ డ్రగ్స్, పలు రకాల ఇంజక్షన్లు, అధిక డోస్ ట్యాబ్‌లెట్స్ వాడుతున్నట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. కొన్నింటిలో స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు, ఫ్లూయిడ్స్ గుర్తించారు. ఏడు క్లినిక్‌లను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ వెల్లడించారు.
ఇటీవల ఒకరి ప్రాణం బలి..
మహమ్మదాబాద్‌కు చెందిన రుకుంపల్లి కిష్టయ్యకు స్వల్పంగా అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆర్‌ఎంపీ బాల్‌రెడ్డి వద్దకు వెళ్లాడు. క్లినిక్‌లో ఉన్న బాల్‌రెడ్డి కుమారుడు నిఖిల్‌రెడ్డి (గాధిర్యాల్ ప్రాథమిక ఉపకేంద్రం డాక్టర్) కిష్టయ్యకు ఇంజక్షన్ చేయడంతో పాటు మాత్రలు ఇచ్చి పంపించాడు. సందరు పేషెంటు అక్కడి నుండి ఇంటికి వెళ్లి మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే నురగలు కక్కుతూ మృతిచెందాడు. అయితే రూ. 15లక్షలకు ప్రాణం ఖరీదు కట్టడంతో పాటు అధికారులు, ఇతర ఫిర్యాదుదారులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే, గతంలో ఓ ఆర్‌ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్న మంగంపేట తండావాసి ప్రాణాల మీదకు తెచ్చుకుని రూ.లక్షలు ఖర్చుచేసుకున్నారు. ఇలా ప్రజల ప్రాణాలతో ఆర్‌ఎంపీలు చెలగాటమాడుతున్నారు. అలాంటి వారిపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


