● ప్రపంచ రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికై న పాలమూరు క్రీడాకారుడు
మహబూబ్‌నగర్ క్రీడలు/జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రోలర్ స్కేటింగ్ క్రీడలో పాలమూరు నగరంలోని కిద్వాయిపేటకు చెందిన కోడుగంటి భరత్‌చంద్ర విశేష ప్రతిభ కనబరుస్తున్నా డు. ఐదేళ్ల నుంచి రోలర్ స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుంటూ అనతికాలంలోనే సత్తా చాటాడు. భరత్‌చంద్ర ఇప్పటివరకు పలుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా ఐదుసార్లు జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2021, 2022, 2023 సంవత్సరాల్లో చండీఘర్‌లో జరిగిన జాతీయస్థాయి జూనియర్ రోలర్ స్కేటింగ్‌లో పాల్గొన్నాడు. 2024లో తమిళనాడు కోయంబత్తూర్‌లో, 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగిన ( 20 ఏళ్లకు పైబడి) సీనియర్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఇటీవల చంఢీఘర్‌లో జరిగిన పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో భరత్‌చంద్ర ప్రపంచ రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. పరాగ్వే దేశం అసున్సియోస్‌లో అక్టోబర్ 2 నుంచి 18 వరకు వరల్డ్ స్కేట్స్ గేమ్స్ పాల్గొనే భారతజట్టుకు ఎంపిక చేశారు.
కలెక్టర్‌కు అభ్యర్థన..
రూ.2.52 లక్షల ఆర్థిక సాయం
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత తనకు లేదని, సాయం అందించాలని భరత్‌చంద్ర మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూగుప్తాను అభ్యర్థించాడు. పరాగ్వే వెళ్లి ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు రూ.5,05,000 ఖర్చవుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా... స్పందించిన కలెక్టర్ జిల్లా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి మొత్తం ఖర్చుల్లో 50 శాతం ఆర్థికసాయం చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం కలెక్టర్ రూ.2,52,250 ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యువతకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భరత్ చంద్ర ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచి దేశానికి, రాష్ట్రానికి, మహబూబ్‌నగర్ జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మరిన్ని పోటీల్లో ఆడడమే లక్ష్యం
రోలర్ స్కేటింగ్‌లో తొలిసారిగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎల్‌బీ స్టేడియంలో కోచ్ జితేందర్‌గుప్త వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో దేశం తరఫున మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో ఆడాలన్నదే లక్ష్యం. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నా. – భరత్‌చంద్ర


