లింగాల: వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోకుండా అబార్షన్ కోసం మాత్రలు మింగడంతో అవి వికటించి మూడావత్ జ్యోతి (26) అనే మహిళ మృతి చెందిన ఘటన పద్మన్నపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మూడావత్ చందూ, జ్యోతి దంపతులు ఆరేళ్ల క్రితం జీవనోపాధికై హైదరాబాద్ వెళ్లి చెత్తసేకరణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, కుమారుడు ఉన్నారు. అయితే ఇటీవల మళ్లీ గర్భం దాల్చడంతో అది ఇష్టం లేని జ్యోతి అబార్షన్ కావాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం డాక్టర్ సలహ తీసుకోకుండా ఓ మెడికల్ షాపులో సొంతంగా మందులు కొనుగోలు చేసి వేసుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యలు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందింది. గర్భిణి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
నాగర్‌కర్నూల్‌లో
దారుణ హత్య
కందనూలు: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కాలనీలో వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం పట్టణంలోని రాంనగర్ కాలనీలోని ఓ ఇంట్లో కరీంపాషా(40)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి, కళ్లలో పొడిచి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కరీం భార్య బంధువులతో కలిసి సోమవారం ఊరికి వెళ్లగా భర్త ఒక్కడే ఉంటున్నాడు. అతని భార్య సలీమా కరీంకు ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. ఇంటిపక్కల అద్దెకున్న వారికి ఫోన్ చేసి తన భర్తకు ఫోన్ ఇవ్వాలని కోరగా ఆమె భర్తకు ఫోన్ ఇచ్చేందుకు వెళ్లగా ఇంట్లో కరీం హత్యకు గురై కన్పించాడు. వెంటనే సలీమాకు ఈ విషయం చెప్పగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. కరీం సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతునట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
భార్యాభర్తలపై దాడి..
లైంగిక దాడి ఆరోపణలు
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని దత్తాత్రేయస్వామి ఆలయం సమీపంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో వారిని అడ్డుకుని, భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు తెలిసింది. ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న వారితో పాటు ఇతరుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మక్తల్ ఎస్‌ఐ రాజు తెలిపారు.


