● ఆస్పత్రిలో చికిత్స.. నిలకడగా ఆరోగ్యం
● హాస్టల్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
కల్వకుర్తి టౌన్: మంచినీరు తాగేందుకు రాత్రివేళ బయటకు వచ్చిన ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతిగృహంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. హాస్టల్ వార్డెన్ రవికుమార్ వివరాల మేరకు.. 9వ తరగతి విద్యార్థి శివ మంచినీరు తాగేందుకు హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. అదే సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. సదరు విద్యార్థిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వార్డెన్ రవికుమార్ తెలిపారు.
● హాస్టల్ విద్యార్థి పాముకాటుకు గురైన విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమా నాయక్ సిబ్బందితో కలిసి హాస్టల్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. హాస్టల్ పరిసరాల పరిశీలన సందర్భంగా ప్రాంగణంలో చెత్త పెద్దఎత్తున పేరుకుపోయి కనిపించడం గమనార్హం. ఉదయం 10 గంటల తర్వాత అక్కడి సిబ్బంది చెత్తను తొలగించారు. చెత్తాచెదారం, అపరిశుభ్ర వాతావరణంతో విషపురుగులు సంచరిస్తున్నాయని.. హాస్టల్ పరిసరాల శుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


