జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలో 167వ నెంబరు జాతీయరహదారిపై ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి డిగ్రి కళాశాల హాస్టల్ భవనం వరకు మొత్తం 750 మీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా సిగ్నల్‌గడ్డ వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హైస్కూల్ వైపు బ్రిడ్జి కోసం 5 గడ్డర్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై మే నెలలో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రెండో వైపు ఉన్న పాత బ్రిడ్జి తొలగించి దాని స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే గురువారం గడ్డర్‌ల ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఉదయం నుంచే రెండు భారీ క్రేన్లు, 1 హైడ్రాలికల్ క్రేన్, పదిమంది నిపుణుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. దీంతో మరో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓ దశలో పెద్ద ఎత్తున బ్రిడ్జికు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు క్రమబద్ధీకరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఐదు గడ్డర్‌లకు గానూ మొదటిరోజున మూడింటిని అమర్చారు. మరో రెండు శుక్రవారం అమర్చనున్నారు. రైల్వేలైన్‌పై గడ్డర్‌ల బిగింపు తరువాత వాటిపై స్లాబ్ వేయనున్నారు. లైన్‌కు రెండు వైపులా ఆర్‌యూబీల నిర్మాణం పూర్తిచేసి మరో మూడు నెలల్లో రాకపోకలు సాగించేలా కసరత్తు చేస్తున్నారు.


