● మహబూబ్‌నగర్ సొసైటీలో
4,719 మంది ఓటర్లు
● చైర్మన్ పదవికి పలువురు
ఆశావహులు.. 15 పోస్టులకు ఎన్నిక
పాలమూరు: దాదాపు మూడేళ్ల తర్వాత జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 2023 ఆగస్టు 3న చివరిసారిగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా.. తాజాగా ఎన్నికల నిర్వహణకు డి.కృష్ణను ఎన్నికల అధికారిగా నియమించారు. అక్టోబర్ 4న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
4,719 మంది ఓటర్లు
మే నాటికి సొసైటీలో 2,851 మంది ఓటర్లు ఉండగా.. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించిన ప్రత్యేక సభ్యత్వ డ్రైవ్ ద్వారా మరో 1,868 మంది కొత్త సభ్యులుగా చేరారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 4,719కు చేరింది. బుధవారం కలెక్టరేట్‌లోని 217వ గదిలో ఓటర్ల జాబితాను ప్రకటించారు. జాబితాపై అభ్యంతరాలను ఈనెల 15లోగా తెలియజేయాలి. 19న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
24 నుంచి నామినేషన్లు
ఈనెల 24న ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఒక్కో నామినేషన్‌దారు రూ.10 వేల డిపాజిట్ చెల్లించాలి. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
చైర్మన్ పదవికి పోటీ
చైర్మన్‌తో పాటు మొత్తం 15 పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత చైర్మన్ నటరాజ్ పదవీకాలం ఆగస్టులో ముగిసింది. దీంతో కొత్త కార్యవర్గం కోసం పలువురు ఆశావహులు పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నగరానికి చెందిన సీనియర్ న్యాయవాదులు, వైద్యులు, సేవా రంగానికి చెందిన పలువురు ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలు జరుగుతాయా.. ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకుంటారా అనేది తేలాల్సి ఉంది.
జిల్లా రెడ్‌క్రాస్ కార్యాలయం


