జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం సత్వరమే పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని బుధవారం తెలంగాణ చౌరస్తాలో జలసాధన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా అంటేనే పెండింగ్ ప్రాజెక్టులకు పేరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యానికి రైతు లు, ప్రజలు ఇంకెంతకాలం బలికావాలని ప్రశ్నించా రు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలోనే ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే జిల్లా శాశ్వతంగా వెనుకబాటులోనే ఉండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతమైన పాలమూరును ఎండబెట్టి నల్లగొండకు నీటిని తరలించే డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయా లని డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని కోరారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి, జేఏసీ కోకన్వీనర్ బెక్కం జనార్దన్, వీరబ్రహ్మచారి, నాయకులు చెన్నకిష్టన్న, వెంకటేశ్వర్లు, రవీందర్‌రెడ్డి, అంజయ్య, కృష్ణముదిరాజ్, హనీఫ్ అహ్మద్, శివన్న, లక్ష్మికాంత్ పాల్గొన్నారు.


