పాలమూరు: శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న నవజాత శిశువుల ఆరోగ్యంపై సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. నగరంలో ఉన్న బాలసదన్, శిశుగృహ కేంద్రాలను బుధవారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్శించారు. స్థానికంగా ఉన్న వసతులు, భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పిల్లలకు సకాలంలో కావాల్సిన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని అధికారుల దగ్గర న్యాయమూర్తి ఆరా తీశారు. ప్రధానంగా శిశుగృహలో ఉంటున్న చిన్నారుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వైద్యులతో నిత్యం టచ్‌లో ఉంటూ వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు.ఆ తర్వాత ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో న్యాయమూర్తి మట్లాడుతూ బాలల హక్కులు, పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, లీగల్ సర్వీసెస్ యాక్ట్‌లపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర, డీడబ్ల్యూఓ జరీనాబేగం, న్యాయవాది రవికుమార్ పాల్గొన్నారు.


