● రహదారులు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు
● ఎమ్మెల్యే జీఎమ్మార్‌కు జీఓ కాపీ అందజేసిన మంత్రి సీతక్క
దేవరకద్ర: నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.73.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. రహదారుల అభివృద్ధి, వంతెనల నిర్మాణం చేపట్టేందుకు జీవో నంబర్లు 477, 478 ద్వారా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గంలో వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అసెంబ్లీలోని మంత్రి సీతక్క చాంబర్‌లో బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి మంజూరైన పనులకు సంబంధించిన జీఓ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మంజూరైన నిధులతో రహదారులు, వంతెనలు మెరుగుపడి గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, విద్యార్థులకు రవాణా సౌకర్యం మెరుగవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు సాధించేందుకు కృషి చేస్తానన్నారు.
మంజూరైన పనులు ఇవే..
పోతులమడుగు–గోపన్నపల్లి మార్గంలో హెచ్‌ఎల్‌బీ నిర్మాణానికి రూ.4 కోట్లు
చిన్నవడ్డెమాన్–ఉంద్యాల మార్గంలో హెచ్‌ఎల్‌బీ నిర్మాణానికి రూ.3 కోట్లు
పోల్కపల్లి ఎస్సీ కాలనీ–కప్పెట మార్గంలో హెచ్‌ఎల్‌బీ నిర్మాణానికి రూ.3.60 కోట్లు
ఎన్‌హెచ్–44 నుంచి ఇస్రంపల్లి, పెద్దమునగల్‌చేడ్ మీదుగా కౌకుంట్ల వరకు రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు
డోకూర్–చౌదర్‌పల్లి మార్గంలో రెండు వంతెనల నిర్మాణానికి రూ.7.20 కోట్లు
కౌకుంట్ల–రేకులంపల్లి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.1.80 కోట్లు
తిమ్మాపూర్–జానంపేట మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.2.70 కోట్లు
దేవరకద్ర–ఆత్మకూర్ పీడబ్ల్యూడీ రోడ్డులో కౌకుంట్ల, రాచాల, ఇస్రంపల్లి వద్ద వంతెనల నిర్మాణానికి రూ.5.40 కోట్లు
మదనాపురం–ఎన్‌హెచ్–44 మార్గంలో పాలెం, దంతనూర్, రామంతపూర్ మీదుగా వంతెన నిర్మాణానికి రూ.7.20 కోట్లు


