మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం శాట్ బాలుర కబడ్డీ అకాడమీ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి అకాడమీలో ప్రవేశాలు పొందిన క్రీడాకారులను అభినందించారు. వారికి సూచనలు, సలహాలు అందజేశారు. డీవైఎస్‌ఓ మాట్లాడుతూ బాలుర కబడ్డీ అకాడమీలో 18 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. మరో ఇద్దరు క్రీడాకారులు మంగళవారం రిపోర్టు చేస్తారని తెలిపారు. రాష్ట్ర క్రీడాచరిత్రలో తొలిసారిగా కబడ్డీ అకాడమీని మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్ మేనేజింగ్ డైరెక్టర్ సోని బాలాదేవి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లో బాలుర కబడ్డీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి ఎనలేని కృషి చేసినట్లు తెలిపారు. అకాడమీలో నిష్ణాతులైన కోచ్‌లతో బాలురకు మెరుగైన కబడ్డీ శిక్షణ అందజేస్తామని తెలిపారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలని కోరారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, ప్రొకబడ్డీ లీగ్‌లో ఎంపికకావడానికి పట్టుదలతో కష్టపడి ఆడాలని సూచించారు. కబడ్డీ అకాడమీ క్రీడాకారులకు అన్ని క్రీడా వసతులు సమకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, కబడ్డీ కోచ్‌లు శివప్రసాద్, రాజు, సంఘం ప్రతినిధులు శ్రీరామ్, బాల్‌రాజు, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


