తెలంగాణ తెచ్చినందుకు సిగ్గుపడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ తెచ్చినందుకు సిగ్గుపడుతున్నాం

Sep 8 2026 1:53 AM | Updated on Sep 8 2026 1:53 AM

పాలించటం చేతకాకపోతే గద్దె దిగండి

పాలమూరు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

జడ్చర్ల టౌన్‌: అనేక మంది బలిదానాలు, ఉద్యమకారుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్‌ చేతుల్లో పెట్టినందుకు సిగ్గుపడుతున్నామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ సోమవారం జడ్చర్లలో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి పోలీసులు అడ్డుకున్నందుకు మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట 167వ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిధులు, అప్పుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని మాత్రమే తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని, ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదన్నారు. వెయ్యి రోజుల పాలనలోనే రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించిన ఆయన.. తమ హయాంలో చేసిన అప్పులను ప్రజాప్రయోజనాలకు వినియోగించామని, ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదన్నారు. పాలన చేతకాకపోతే గద్దె దిగాలని, సరైన సమయంలో కేసీఆర్‌ తిరిగి వస్తారని అన్నారు.

సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

అసెంబ్లీలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధర్నా, రాస్తారోకోలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement