● ప్రశాంతంగా, పారదర్శకంగా
నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని ఎంఎస్‌ఏస్ ఇన్ఫోటెక్ సర్వీసెస్, ఫాతిమా విద్యాలయ, క్రిస్టియన్‌పల్లి కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కేంద్రాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీ కెమెరాల నిఘా, నిరంతర విద్యుత్, తాగునీరు, ప్రథమ చికిత్స, అంబులెన్స్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, దివ్యాంగులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని, నిర్ణీత సమయానికి ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.


