అమరచింత: ప్రస్తుత ప్రపంచంలో అత్యధికతతో వైద్యసేవలు విస్తరిస్తున్న క్యాన్సర్‌ను దూరం చేసే పరిజ్ఞానం అందుబాటులోకి రాకపోవడంతో ఎంతోమంది క్యాన్సర్‌కు గురై మృతి చెందుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములును పరామర్శించిన ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ కరోనా కంటే భయంకరంగా మారిందన్నారు. ప్రపంచాన్ని వనికించిన కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొన్నారని క్యాన్సర్ నిరోధకానికి వ్యాక్సిన్ కనుకోలేక పోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా క్యాన్సర్ నిరోధకంకు అడ్డుకట్టవేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాలతోపాటు పట్టణాల్లో నివసించే ప్రతిఒక్కరికీ క్యాన్సర్ పరీక్షలను నిర్వహించాలని, దీంతో ఎంతమంది వ్యాధితో బాధపడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉందన్నారు. వ్యాధి తొలిదశలో ఉంటే వైద్యంతో నియంత్రించే అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాధి సంక్రమించి చివరి దశలో ఉంటే ఎన్ని లక్షలు వెచ్చించినా ఫలితం లేక ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితులు దాపురించాయన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడంతో వ్యాధిని త్వరితంగా నిరోధించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన వెంట సీపీఐ నాయకులు బాలనరసింహులు, అబ్రహం, శ్రీహరి, భాస్కర్, మోషా, సురేష్, ఆర్‌ఎన్.శంకర్‌తోపాటు పలువురు ఉన్నారు.


