● కలెక్టర్ ఖుష్బూ గుప్తా
● ప్రజావాణిలో 62 ఫిర్యాదుల స్వీకరణ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రజావాణిలో ప్ర జలు సమర్పించే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఉపాధి, రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం తదితర అంశాలపై 62 ఫిర్యాదులు అందాయి. జిల్లా, సీఎం ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. శాఖల వారీగా పెండింగ్ వివరాలను అధికారుల గ్రూపుల్లో పంపిస్తామని, పరిష్కరించిన అంశాలు, తీసుకున్న చర్యలతో కూడిన యాక్షన్ టేకెన్ రిపోర్టును సమర్పించాలని ఆదేశించారు. పరిష్కారం సాధ్యం కాని దరఖాస్తులకు కారణాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని, చిన్న సమస్యలను సైతం వెంటనే పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. మహ బూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. వి ద్యార్థుల హాస్టల్ కేటాయింపు దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించాలని, ఇరిగేషన్ శాఖలో ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరమైన వాటిపై వెంటనే విచారణ నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎస్పీ కార్యాలయానికి సంబంధించిన దరఖాస్తులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్‌రెడ్డి, జెడ్పీ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, గృహనిర్మాణ శా ఖ పీడీ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


