పబ్లిక్‌ స్కూల్స్‌కు నిధుల వరద | - | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ స్కూల్స్‌కు నిధుల వరద

Sep 8 2026 1:47 AM | Updated on Sep 8 2026 1:47 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి వసతులు.. నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌కు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎంపిక చేసిన వాటిని పబ్లిక్‌ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేయనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలిదశలో 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం రూ.87 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ నంబర్‌ 164ను విడుదల చేసింది.

నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్య అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒకే క్యాంపస్‌లో అన్ని తరగతులకు బోధన కొనసాగనుంది. ఇందుకోసం ఆధునిక తరగతి గదులతో పాటు సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్స్‌, క్రీడా మైదానం, మరుగుదొడ్లు తదితర వసతులను కల్పించనున్నారు. అవసరమైన చోట్ల రవాణా సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంటర్‌ బోర్డును పాఠశాల విద్యా బోర్డులో విలీనం చేసే ప్రక్రియ నేపథ్యంలో పబ్లిక్‌ స్కూల్స్‌లో ఇంటర్‌ వరకు విద్య కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుతో కొత్తగా భారీగా సిబ్బందిని నియమించాల్సిన అవ సరం లేకుండా.. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందినే వినియోగించే అవకాశముంది. పాఠశాలల అభివృద్ధికి అవసరమైన అదనపు వసతులను ప్రభుత్వం కల్పించనుంది.

నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌

ఉమ్మడి జిల్లాలో 8 పాఠశాలలకు రూ.87 కోట్ల నిధులు

నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య

తరగతి గదులు, ల్యాబ్స్‌, గ్రౌండ్‌, మరుగుదొడ్లతో ఆధునిక వసతులు

స్థలం ఉన్న బడులకే ప్రాధాన్యం

ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా.. ప్రస్తుతం 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. మరో ఆరు నియోజకవర్గాలకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పాఠశాల లేదా స్థలం ఎంపిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు ప్రధానంగా ఇప్పటికే స్థలం, భవనాలు అందుబాటులో ఉన్న జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు. అయితే మహబూబ్‌నగర్‌లో మాత్రం మార్కెట్‌ రోడ్డులోని బాలికల పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో ప్రత్యేక ప్రతిపాదన చేశారు. ఈ పాఠశాలను ఎంవీఎస్‌ జూనియర్‌ కళాశాల ప్రాంగణానికి తరలించి.. అక్కడ పబ్లిక్‌ స్కూల్‌ భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement