2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? | - | Sakshi
Sakshi News home page

2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?

Sep 6 2026 1:01 AM | Updated on Sep 6 2026 1:01 AM

జీవో 97ను రద్దు చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ప్రదర్శన

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీని ఏమి చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్‌ చౌరస్తాలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సుమారు రూ.10 వేల కోట్లకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. పేద విద్యార్థులకు పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ విద్యను దూరం చేసేందుకే జీఓ 97ను తీసుకొచ్చారని, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గురుకులాలు, వసతి గృహాల్లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన నియామక ప్రక్రియకు చివర్లో నియామక పత్రాలు అందించి.. తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. విద్యార్థినులకు స్కూటీలు, ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని, యూరియా సరఫరాలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు శివరాజ్‌, గంజి వెంకన్న, నర్సింహులు, ఆంజనేయులు, గిరిధర్‌రెడ్డి, కట్ట రవికిషన్‌, కిషోర్‌కుమార్‌, నవకాంత్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీశైలం, అనంతరెడ్డి, శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement