చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి

Sep 6 2026 1:01 AM | Updated on Sep 6 2026 1:01 AM

అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): వినాయక చవితి ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ జానకితో కలిసి జిల్లా స్థాయి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యుల నుంచి గతంలో ఎదురైన సమస్యలు, అవసరమైన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో 350 గణేష్‌ మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు సభ్యులు తెలిపా రు. మండపాలకు విద్యుత్‌ కనెక్షన్లు, నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లు, లైటింగ్‌, గజ ఈతగాళ్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కేంద్రాలు, అంబులెన్స్‌లను ఏర్పాటు చే యాలని సూచించారు. శోభాయాత్ర మార్గాల్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలను సరిచేయడంతో పాటు గుంతలు పూడ్చి రహదారులు మరమ్మతు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిమజ్జన మార్గాల్లో అడ్డంకులను తొలగించి, భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు.

నిబంధనలు పాటించాలి: ఎస్పీ

గణేష్‌ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి కోరారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని, చిన్న విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డీజేలు, అధిక శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో ఇతర వర్గాల మనోభావాలను గౌరవిస్తూ మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, రహదారులను పూర్తిగా మూసివేయకుండా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బంది, నిర్వాహకులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, ట్రెయినీ కలెక్టర్‌ సాయి శివాని, డీఆర్‌ఓ నిర్మల, ఏఎస్పీ రత్నం, జిల్లా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement