● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి
● జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ సంస్కారం, విలువలు, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయిలో ఎంపికై న 69 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల దృష్టి మరల్చే అంశాలు అనేకం ఉన్నందున వారిని సరైన మార్గంలో నడిపించాలన్నారు. సమాజాన్ని మంచి మార్గం వైపు నడిపించే శక్తి ఉపాధ్యాయులకు ఉందన్నారు. విద్యారంగంలో ప్రయోగాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ డిజిటల్ లెర్నింగ్, పాఠ్యపుస్తకాలు, త్రీడీ యానిమేషన్ల ద్వారా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 100 మంది విద్యా వలంటీర్లను నియమించి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కృషితో వివిధ రంగాల్లో నిపుణులు తయారవుతున్నారని అన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. 69 మందికి అవార్డులు అందిస్తున్నప్పటికీ ప్రతి ఉపాధ్యాయుడు ఈ గౌరవానికి అర్హుడేనని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులే ప్రేరణ, మార్గదర్శకులు, ఆదర్శమని అన్నారు.కార్యక్రమంలో డీఈఓ విజయకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి విష్ణునందన్, ఏఎంఈఓ శ్రీనివాస్, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.


