● భూ బాధితులతో అధికారుల చర్చలు
● డబ్లింగ్ పనులకు ముందే అండర్‌పాస్ నిర్మించాలి: దేవరకద్ర ప్రజల విజ్ఞప్తి
దేవరకద్ర: రైల్వే డబ్లింగ్ పనుల కోసం దేవరకద్రలో సేకరించనున్న భూములను జిల్లా అధికారుల బృందం శనివారం పరిశీలించింది. భూములు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి నష్టపరిహారంపై చర్చించారు. ట్రెయినీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హరిప్రియ, ఆర్డీఓ నవీన్‌కుమార్, రైల్వే అధికారి రవి, తహసీల్దార్ హర్షద్, ఆర్‌ఐ శరత్ పాల్గొన్నారు. పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలకు గజం చొప్పున, వ్యవసాయ భూములకు ఎకరం ప్రాతిపదికన ప్రభుత్వం నిర్ణయించే ధర మేరకు నష్టపరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వ ధరల కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని భూబాధితులు కోరారు. దేవరకద్ర శివారులో పాత రైల్వే ట్రాక్ పొడవునా సుమారు 5.11 ఎకరాల భూమిని సేకరించేందుకు ఇప్పటికే సర్వే నిర్వహించి బాధితులను గుర్తించారు. నష్టపరిహారం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధ్యమైనంత మేరకు మంచి పరిహారం అందేలా ప్రయత్నిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
అండర్‌పాస్ నిర్మించాలి
ఆర్వోబీ నిర్మాణంతో మూసివేసిన రైల్వే గేటు వద్ద ఇబ్బందులు పడుతున్నారని, డబ్లింగ్ పనులు ప్రా రంభించే ముందే చిన్న వాహనాలు, బైక్‌లు వెళ్లేలా అండర్‌పాస్ నిర్మించాలని ప్రజలు కోరారు. డబ్లింగ్ పూర్తయిన తర్వాత రైళ్ల రాకపోకలు పెరిగే అవకాశం ఉన్నందున అండర్‌పాస్ నిర్మాణం మరింత కష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే, రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
బ్రహ్మోస్ క్షిపణి పరిశ్రమకు భూసేకరణపై చర్చ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): చౌదర్‌పల్లిలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బ్రహ్మోస్ క్షిపణి తయారీ పరిశ్రమకు అవసరమైన భూసేకరణపై శనివారం కలెక్టరేట్‌లో నెగోషియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూసేకరణకు సంబంధించి రైతులతో చర్చించారు. సేకరించనున్న భూములకు చెల్లించాల్సిన పరిహారం, భూమి విలువ తదితర అంశాలపై రైతుల అభిప్రాయాలను కమిటీ తెలుసుకుంది. భూసేకరణ ప్రక్రియ, పరిహారం నిర్ణయానికి సంబంధించిన అంశాలను రైతులకు వివరించింది. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, ఆర్డీఓ నవీన్, చౌదర్‌పల్లి రైతులు పాల్గొన్నారు.


