మక్తల్: పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చోరీ జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. బుధవారం రాత్రి విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి దాదాపు రూ.3 లక్షలు విలువైన రాగి వైర్లను ఎత్తుకెళ్లారు. గురువారం సిబ్బంది గమనించి సాయంత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా ముగ్గురు నిందితులు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీలో గుర్తు తెలియని వ్యక్తుల ప్రమేయం ఉందా లేక సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్న వారి పనా.. అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే బుధవారం రాత్రి చోరీ జరిగితే విద్యుత్ అధికారులు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.


