ప్రేమ పెళ్లి.. ఇంతలోనే విషాదం! | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి.. ఇంతలోనే విషాదం!

Sep 5 2026 6:19 AM | Updated on Sep 5 2026 6:19 AM

వివాహమైన మూడు నెలలకే

యువకుడి మృతి

భూత్పూర్‌: ప్రేమ వివాహం చేసుకున్న మూడు నెలలకే భార్యాభర్తల మధ్య కలహాలతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన భూత్పూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం చందాపూర్‌కు చెందిన అయ్యప్ప (22) భూత్పూర్‌ మండలం పోతులమడుగుకు చెందిన నందినిని మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయ్యప్ప ప్రైవేట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి తర్వాత భూత్పూర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం నందిని ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. సాయంత్రం తిరిగి రాగా.. అప్పటికే ఇంట్లో ఉరి వేసుకొని అయ్యప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం అయ్యప్ప సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కరెంట్‌ షాక్‌తో ఇంటి పెద్దదిక్కు మృతి

ఇంట్లో స్విచ్‌ వేయబోతుండగా విద్యుదాఘాతం

మదనాపురం: క్షణాల్లో జరిగిన విద్యుత్‌ ప్రమాదం ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో ఫ్యాన్‌, ఫ్రిజ్‌ స్విచ్‌ ఆన్‌ చేయబోతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మదనాపురం మండలం కరివేన తండాలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కరివేన తండాకు చెందిన కేతావత్‌ పుల్యా నాయక్‌ (48) ఇంట్లోని విద్యుత్‌ బోర్డులో ఫ్యాన్‌, ఫ్రిజ్‌కు సంబంధించిన వైర్లను సరిచేస్తుండగా అనుకోకుండా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర విద్యుత్‌ ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య చంద్రమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఊహించని ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిరుతదాడిలో ఆవుదూడ మృతి

గండేడ్‌: మండలంలో చిరుతపులుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. మండల పరిధిలోని రెడ్డిపల్లికి చెందిన బోడి రామయ్య రెడ్డిచెరువు సమీపంలోని దేవునికుచ్చ వద్ద పొలంలో వేసిన పాకలో గురువారం రాత్రి పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వెళ్లి చూడగా చిరుత ఆవుదూడపై దాడి చేసి సగభాగం తిని వదిలి వెళ్లింది. పశువుల పాక చిరుతపులుల ఆవాసం ఉండే బొందేగట్టు ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఉంది. రాత్రిళ్లు చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉందని బాధిత రైతు వాపోతున్నాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌, బీట్‌ అధికారి ఉదయేశ్వర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడికి పరిహారం అందేలా చూస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement