సా్థనికంగానే సాగు! | - | Sakshi
Sakshi News home page

సా్థనికంగానే సాగు!

Sep 4 2026 7:23 AM | Updated on Sep 4 2026 7:23 AM

గద్వాల క్రైం: స్థానికంగా గంజాయి సాగు కలకలం సృష్టిస్తోంది. ఈజీ మనీ కోసం కొందరు గుట్టుగా పత్తి, జొన్న చేనుల్లో గంజాయిని అంతర పంటగా పండించడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం సమస్యగా మారింది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి విత్తనాలను కొనుగోలుచేసి.. ఎవరికి అనుమానం కలగకుండా పంట పొలాల్లో గుట్టుగా పండిస్తున్నారు. ఆ తర్వాత మొక్కలను పంట పొలాల్లోనే ఎండబెట్టి, పాకెట్ల రూపంలో విక్రయాలు చేస్తున్నారు. తాజాగా గద్వాల జిల్లాలో పండించిన 5.57 కిలోల గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ.. పోలీసులకు పట్టుబడటం కలకలం రేపుతోంది.

కొత్త పంథాలో..

ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ద్వారా గంజాయి కొనుగోలు చేసి.. స్థానికంగా విక్రయాలు సాగించడం చేస్తున్నారు. ఈ తరహా దందాపై స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి.. ఎక్కడిక్కడ సోదాలు నిర్వహిస్తూ, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మో పుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు కొత్త పంథాను ఎంచుకున్నారు. తమ పంట పొలాల్లోనే గుట్టుగా గంజాయి పండించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల అయిజ, మల్దకల్‌, ఇటిక్యాల మండలాల్లో గంజాయి సాగుచేసి.. ఎండిన తర్వాత విక్రయాలు చేస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా పోలీసుశాఖ గుర్తించి.. అక్రమార్కుల దందాను కట్టడి చేస్తున్నారు. రానున్న రోజుల్లో గంజాయి దందా మరెలాంటి కొత్త పంథాలో సాగుతుందోనని పోలీసులు అప్రమత్తమవుతున్నారు.

● ఇటీవల గద్వాల జిల్లా కేంద్రంలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌, సాంకేతిక విభాగం సిబ్బంది చంద్రయ్య, కిరణ్‌, వీరేశ్‌కు ఎస్పీ శ్రీనివాసరావు క్యాష్‌ రివార్డులను ప్రకటించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, విక్రయాలు చేస్తున్నట్లు తెలిస్తే డయల్‌ 112కు సమాచారం అందజేయాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి డీ అడిక్షన్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌ అందించి, వారిలో మార్పునకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

పత్తి, జొన్న పంటల్లో అంతర పంటగా గంజాయి

మొక్కలను ఎండబెట్టి

ఇతర ప్రాంతాలకు సరఫరా

కిలోల కొద్దీ విక్రయాలతో అక్రమార్జన

గద్వాల జిల్లాలో తాజా ఘటనతో కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement