నారాయణపేట: స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వరుసగా సంభవిస్తున్న మరణాలపై సమ గ్ర విచారణ చేపట్టేందుకు హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం మంగళవారం నారాయణపేటకు వచ్చింది. ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ బాబురావు, (పీడియాట్రిక్ సర్జన్), డాక్టర్ కవిత (పీడియాట్రిక్ ప్రొఫెసర్), సూపరింటెండెంట్ సంపత్‌కుమార్‌సింగ్ సమక్షంలో విచారణ చేశారు. వైద్య సేవలు, బాధితులకు అందించిన చికిత్స విధానం, రికార్డులు, మృతికి దారితీసిన పరిస్థితులు తదితర అంశాలను బృందం సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, చికిత్స సమయంలో తీసుకున్న చర్యలు, వైద్య సదుపాయాల అందుబాటు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిసింది. సంబంధిత వైద్యులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం.


