ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి..
● బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన
ఇంటర్ విద్యార్థి మృతి
● స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా
కుప్పకూలిన రవితేజ
● ఆస్పత్రికి తరలించేలోపే మృతి..
కుటుంబంలో తీరని విషాదం
కోస్గి: పెళ్లి బరాత్.. స్నేహితులతో కలిసి ఆనందంగా డ్యాన్స్.. అంతలోనే ఊహించని విషాదం. పెళ్లి వే డుకలో ఉత్సాహంగా పాల్గొన్న ఇంటర్ విద్యార్థి ఒ క్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. దీంతో పెళ్లి సందడి కాస్తా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదన స్థానికులను కలచివేసింది. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రవితేజ (15) కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సొంత గ్రామానికి చెందిన ఓ స్నేహితుడి అక్క పెళ్లి ఆదివారం జరగగా.. సోమవారం రాత్రి బరాత్ నిర్వహించారు. గ్రామ శివారులోని పోచమ్మ ఆలయం నుంచి డీజేతో బరాత్ ఊరేగింపు ప్రారంభమైంది. రవితేజ తన స్నేహితులతో కలిసి డీజే ముందు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ పాల్గొన్నాడు. అర్ధరాత్రి సమయంలో డ్యాన్స్ చేస్తుండగా రవితేజ ఒక్కసారిగా కుప్పకూలి సీసీ రోడ్డుపై పడిపోయాడు. అతడిలో ఎలాంటి కదలిక లేకపోవడంతో స్నేహితులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ప్రైవేట్ వాహనంలో కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డీజే సౌండ్‌కు గుండెపోటు రావడంతో కుప్పకూలి సీసీ రోడ్డుపై పడటంతో తల వెనుకభాగం రోడ్డుకు బలంగా తగలడంతో రవితేజ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రవితేజ మృతితో తల్లిదండ్రులు లక్ష్మీ,దస్తయ్యలకు టుంబంలో తీరని విషాదం నెలకొంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుమారుడు ఒక్కసారిగా తమకు దూరం కావడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లి వేడుక కోసం వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు గ్రామంలో విషాదాన్ని నింపాయి. ఆనందంగా సాగాల్సిన పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.


