మరో ఘటనలో భార్యాభర్తల మధ్య విభేదాల తో ఇంటి నుంచి వెళ్లిపోయిన రాములు కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా బాజాపురానికి చెందిన రాములు (35) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో కొత్తకోట మండలం రాణిపేటలో పెరిగాడు. 15 ఏళ్ల క్రితం అడ్డాకుల మండలానికి చెందిన సుజాతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గొర్రెల కాపరిగా జీవనం సాగించే రాములు ఇటీవల కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వెళ్లి.. సుమారు 20 రోజుల క్రితం రాణిపేటకు తిరిగొచ్చాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆగస్టు 29న ఇంటి నుంచి వెళ్లిపోయిన రాములు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు పలుచోట్ల గాలించారు. గ్రామ శివారులోని రంగసముద్రం కాల్వ సమీపంలో మంగళవారం ఆయన చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అధికారుల సహకారంతో గాలింపు చేపట్టగా ముమ్మళ్లపల్లి శివారులో రాములు మృతదేహం లభ్యమైంది. భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం.విక్రమ్ తెలిపారు.


