● తక్కువ పెట్టుబడితో స్థిరమైన
దిగుబడులే లక్ష్యం
● జీవామృతం, కషాయాల తయారీపై రైతులకు ప్రాయోగిక శిక్షణ
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి నేల సారాన్ని కాపాడుతూ తక్కువ పెట్టుబడితో పంటలు సాగు చేసే సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్‌వీకే) ఆధ్వర్యంలో గురువారం కోటకదిరలోని రైతు ఆలా జ్ఞానేశ్వర్‌రెడ్డి క్షేత్రంలో ప్రాయోగిక శిక్షణ నిర్వహించారు. టీఆర్‌వీకే సమన్వయకర్త, శాస్త్రవేత్త కె.కల్యాణి సమన్వయం చేసిన కార్యక్రమంలో జేడీఏ కె.గోవింద్‌నాయక్, ఏడీఏ రాంపాల్, ఏఓ శ్రుతి, ఏఈఓ కృష్ణకాంత్, ఏకోక్లబ్ అధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.
జీవామృతం.. కషాయాల తయారీ
స్థానికంగా లభించే సహజ వనరులతో బీజామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారీ విధానాలను రైతు జ్ఞానేశ్వర్‌రెడ్డి ప్రదర్శించారు. విత్తన శుద్ధి నుంచి పంట ఎదుగుదల వరకు వీటి వినియోగాన్ని వివరించారు. సీతాఫలం, కానుగ, వేప గింజలతో కషాయాల తయారీ, చీడపీడల నియంత్రణలో వాటి వినియోగంపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు. అరటి, సపోటా, నేరేడు, బూడిద గుమ్మడి తదితర పంట ఉత్పత్తులతో ఎంజైముల తయారీ, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, మైకోరైజా వినియోగంపైనా వివరించారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా..
వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ వ్యవసాయ పద్ధతులను పాటించాలని శాస్త్రవేత్త కె.కల్యాణి సూచించారు. స్థానిక వనరులను వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుందని జేడీఏ గోవింద్‌నాయక్ తెలిపారు. రైతులు తొలుత కొంత విస్తీర్ణంలో సహజ సాగు పద్ధతులను అమలు చేసి ఫలితాలను పరిశీలించాలని సూచించారు. శిక్షణ అనంతరం రైతులు జ్ఞానేశ్వర్‌రెడ్డి క్షేత్రంలో సాగు చేస్తున్న వరి, జొన్న, సజ్జ, మినుము, కూరగాయల పంటలను పరిశీలించారు. సుమారు 20 మంది రైతులు పాల్గొని సహజ సాగు పద్ధతులపై నిపుణులతో సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


