విద్య, బోధన, సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలు | - | Sakshi
Sakshi News home page

విద్య, బోధన, సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలు

Sep 4 2026 1:18 AM | Updated on Sep 4 2026 1:18 AM

జడ్చర్ల: విద్య, బోధనతో పాటు సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న జడ్చర్ల డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌, కామర్స్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.వేముల శ్రీనివాసులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు 1995 జూన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం 2001లో నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కామర్స్‌ జూనియర్‌ లెక్చరర్‌గా నియమితులయ్యారు. కొండనాగులలోని 2010లో ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్‌ డిగ్రీ లెక్చరర్‌గా బాధ్యతలు చేపట్టారు. తదుపరి మల్కాజిగిరిలో 2024 వరకు సేవలందించిన ఆయన బదిలీపై జడ్చర్లలోని డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చారు. ప్రస్తుతం కామర్స్‌ విభాగాధిపతిగా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా..కామర్స్‌ విద్యార్థులకు ఉపయోగపడేలా శ్రీనివాసులు నాలుగు పాఠ్యగ్రంథాలను రచించి ప్రచురించారు. విద్య, బోధనతో పాటు సాహిత్య రంగంపైనా ఆసక్తి కనబరుస్తూ తెలంగాణ ఉద్యమ గీతాలు, మద్యం వ్యతిరేక గేయాలు, కవితలను రచించి ప్రచురించారు. బోధన, రచనా రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీనివాసులు అవార్డుకు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సుకన్యతో పాటు అధ్యాపకులు డా.నర్మద, రాఘవేంద్రరెడ్డి, సులేమాన్‌, సదాశివయ్య, ఆంజనేయులు, నర్సింగ్‌రావు, వెంకటయ్య అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement