మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాకే తలమానికమైన నగరంలోని మెయిన్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్‌కు ముందడుగు పడింది. రూ.10.70 కోట్ల నిధులతో మెయిన్ స్టేడియంలో ఎంతో అధునాతనమైన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు చేయనున్న పనులకు మోక్షం లభించింది. 400 మీటర్ల పొడవు 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణ పనులు గత రెండో రోజుల నుంచి మెయిన్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మట్టిని తీత, గడ్డి తొలిగించే పనులు కొనసాగుతున్నాయి. ట్రాక్ నిర్మాణం పూర్తయితే అథ్లెట్లకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయి. ట్రాక్‌లో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయి. సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు అయితే మెయిన్ స్టేడియంలో జాతీయ స్థాయి టోర్నీలు నిర్వహించే అవకాశం ఉంటుంది. జిల్లాకు చెందిన అథ్లెట్లు హైదరాబాద్‌లో కాకుండా ఇక్కడి సింథటిక్ ట్రాక్‌లో రెగ్యులర్‌గా ప్రాక్టిస్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అథ్లెట్లకు రన్నింగ్‌లో టైమింగ్‌ను మెరుగుపరుచుకోవచ్చు. మెయిన్ స్టేడియంలో వర్షం వచ్చిన్నప్పుడల్లా స్టేడియంలో నీళ్లు చేరి అథ్లెట్లు ప్రాక్టిస్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడేది. సింథటిక్ ట్రాక్ ఏర్పాటుతో ఇలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటారు. దీంతో వర్షపు నీళ్లు ట్రాక్‌లో నిలిచే అవకాశం ఉండదు. మెయిన్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు కానుండడంతో జిల్లా అథ్లెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు కావాలని కోరుతున్నామని, ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మెయిన్ స్టేడియంలో రూ.10.70 కోట్లతో నిర్మాణం
అథ్లెట్లకు అందుబాటులోకి మెరుగైన వసతులు
ట్రాక్ పూర్తయితే
జాతీయ పోటీలకు అవకాశం


