● ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సంఘాలదే బాధ్యత
● ఐదు జిల్లాల్లో 9 పీఏసీఎస్‌లతో పైలట్ ప్రాజెక్టు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీకే పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఇక విత్తనోత్పత్తి వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నాయి. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తితో పాటు ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ చేపట్టి ఆదా యాన్ని పెంచుకోనున్నాయి. స్థానికంగానే నాణ్య మైన విత్తనాలు లభించడంతో రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో పీజేటీఎస్‌ఏయూ ఆధ్వర్యంలో గురువారం మహబూబ్‌నగర్ డీసీసీబీలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందిన 9 పీఏసీఎస్‌ల ప్రతినిధులు, సీఈఓలతో 50 మంది రైతులు పాల్గొన్నారు. గ్వాలియర్ యూనివర్సిటీ మాజీ వీసీ ఎస్‌కే రావు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనమే అధిక దిగుబడి, రైతుల ఆదాయానికి కీలకమన్నారు. పీఏసీఎస్‌లు విత్తనోత్పత్తిని లాభదాయక వ్యాపారంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పీజేటీఎస్‌ఏయూ ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు డాక్టర్ ఎంవీ నాగేష్ మాట్లాడుతూ విత్తన ఎంపిక నుంచి సాగు, నాణ్యత నియంత్రణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ వరకు ప్రతి దశలో ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ పీజేటీఎస్‌ఏయూ, నాబా ర్డు, సహకార శాఖ, పీఏసీఎస్‌లు, రైతుల సమన్వయంతో ప్రాజెక్టును విజయవంతం చేయవచ్చన్నా రు. ఆర్‌ఏఆర్‌ఎస్ పాలెం ఏడీఆర్ డాక్టర్ ఎల్.కృష్ణ డీసీసీబీ సీఈఓ మహ్మద్ షఫీ ఉల్లా ఖాన్, నాబార్డు డీడీఎంలు షణ్ముఖచారి, మహేందర్, డీసీఓ కృష్ణ పాల్గొన్నారు.


