మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో జరిగిన డిప్యుటేషన్లపై విద్యాశాఖ స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన డిప్యుటేషన్లను పునఃపరిశీలించడంతో పాటు బాధ్యులైన ఎంఈఓలపై చర్యలు తీసుకుంటామని డీఈఓ విజయకుమారి స్పష్టం చేశారు. ఈ మేరకు ‘సాక్షి’లో బుధవారం ‘అడ్డగోలుగా డిప్యుటేషన్లు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో మొత్తం 197 డిప్యుటేషన్లు ఉండగా.. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన వాటిని పరిశీలిస్తామని డీఈఓ తెలిపారు. ముఖ్యంగా గండేడ్, మహమ్మదాబాద్, సీసీకుంట, హన్వాడ మండలాల్లో జరిగిన డిప్యుటేషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ఉపాధ్యాయులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే డీఈఓ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు.
సంఘాల ఫిర్యాదులు..
ఇదిలా ఉండగా.. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురువారం డీఈఓను కలిసి డిప్యుటేషన్లపై ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన బదిలీలను పునఃసమీక్షించాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎంఈఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గండేడ్, మహ్మదాబాద్, సీసీకుంట, హన్వాడ మండలాల్లో జరిగిన డిప్యుటేషన్లను మరోసారి పరిశీలించాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేష్ ఆధ్వర్యంలో డీఈఓకు నోటీసులు అందజేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధన్‌మోహన్, సుధాకర్‌రెడ్డి, బుచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అడ్డగోలు డిప్యుటేషన్లపై
అధికారుల స్పందన
197 డిప్యుటేషన్లలో నిబంధనల ఉల్లంఘనపై పునఃపరిశీలన
బాధ్యులైన ఎంఈఓలపై చర్యలు: డీఈఓ


