సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వచ్చేసింది. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలను చాటే ఈ పర్వదినం ప్రతి ఇంటా సందడి తీసుకొస్తోంది. సోదరుడి క్షేమాన్ని కోరుతూ సోదరి మణికట్టుకు రాఖీ కట్టడం.. ఆమెకు అండగా ఉంటానంటూ సోదరుడు భరోసా ఇవ్వడం.. ఈ పండుగ ప్రత్యేకత. ఆత్మీయుల మధ్య అనుబంధానికి, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా నిలస్తుంది రాఖీ. ఆధునిక కాలంలోనూ ఎక్కడ ఉన్నా తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు.. అక్కాచెల్లెళ్లు తరలివస్తుంటారు. కాలం మారినా.. బంధం విలువను చాటే రక్షాబంధన్ సంప్రదాయం మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది.
– స్టేషన్ మహబూబ్‌నగర్
సోదరసోదరీమణుల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలకు జిల్లా సిద్ధమైంది. శ్రావణమాసంలో వచ్చే ఈ పర్వదినాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోనున్నారు. సోదరుడి క్షేమాన్ని కోరుతూ సోదరీమణులు రాఖీ కట్టడం, వారికి సోదరులు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని మార్కెట్లు రాఖీలతో సందడిగా మారాయి.
కళకళలాడుతున్న మార్కెట్లు
పండుగ నేపథ్యంలో మహబూబ్‌నగర్ నగరంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు, రహదారుల వెంట రాఖీ స్టాళ్లు వెలిశాయి. గత రెండు రోజులుగా విక్రయాలు ఊపందుకున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు పోస్టు, కొరియర్ ద్వారా రాఖీలు పంపేందుకు సోదరీమణులు కొనుగోలు చేస్తున్నారు. సాయంత్రం వేళ విక్రయ కేంద్రాలు కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తున్నాయి.
● మార్కెట్లో ఆకట్టుకునే డిజైన్లలో రాఖీలు అందుబాటులో ఉన్నాయి. అన్నయ్య, తమ్ముడి పేర్లతో ప్రత్యేకంగా రూపొందించిన రాఖీలకు ఆదరణ కనిపిస్తోంది. చిన్నారుల కోసం స్పైడర్‌మ్యాన్ తదితర కార్టూన్ క్యారెక్టర్లతో కూడిన రాఖీలు ఉన్నాయి. మెటల్, కుందన్, ప్రింటెడ్, హ్యాండ్‌మేడ్, వుడెన్, ఫ్యాషన్ డిజైన్లతో పాటు లైట్‌వెయిట్, పెద్దసైజు రాఖీలు అందుబాటులో ఉన్నాయి. వెండి, బంగారు రాఖీలు సైతం మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. డిజైన్, రకాన్ని బట్టి రాఖీల ధరలు రూ.5 నుంచి రూ.600 వరకు ఉన్నాయి.
బాధ్యతను గుర్తుచేసే రక్ష
రక్షా బంధనం సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక. హైందవ సంప్రదాయంలో శుభకార్యాల సందర్భంగా మణికట్టుకు రక్షాసూత్రం కట్టడం ఆనవాయితీ. సోదరుడి విజయాన్ని, సంతోషాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రాఖీ కట్టడం ద్వారా ఆ బంధాన్ని మరింత బలపరుస్తారు.


