జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ సర్కారుపై సమరశంఖం పూరించింది. పీఆర్‌సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు తదితర డిమాండ్లతో గురువారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించింది. జిల్లా అధికారుల నుంచి తహసీల్దార్ స్థాయి అధికారుల వరకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ హరిప్రియకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. జేఏసీ జిల్లా చైర్మన్ గవినోళ్ల రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా రెండో పీఆర్‌సీని ప్రకటించకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోవడంతో ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపారని.. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
ఉపాధ్యాయ సమస్యలపై ఆగ్రహం
జేఏసీ జిల్లా కన్వీనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించడంతో పాటు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవో 25 ద్వారా ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో దూర మండలాలకు పంపడం వల్ల వారు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
అధికారుల మద్దతు
ధర్నాకు డీఈఓ విజయకుమారి, డీటీఓ శ్రీనివాస్, డీఎస్‌ఓ గంప శ్రీనివాస్, డీసీఓ టైటస్‌పాల్, తహసీల్దార్లు కిషన్ తదితరులు మద్దతు తెలిపారు. రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, ఎలక్ట్రిసిటీ జేఏసీ నాయకులు రాఘవేందర్, స్వామి, పాండు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ కోచైర్మన్లు రవికుమార్, మదన్‌మోహన్‌యాదవ్, చంద్రానాయక్, నర్సింలు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్, కోకన్వీనర్లు బాలు యాదవ్, వెంకటేష్, శ్యాంబాబు, జుర్రు నారాయణ, డీటీలు దేవేందర్, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
పీఆర్‌సీ.. డీఏల కోసం కలెక్టరేట్ ముట్టడించిన ఉద్యోగులు
సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్
సెప్టెంబర్ 10న
చలో హైదరాబాద్‌కు పిలుపు


