అడుగంటిన కోయిల్‌సాగర్‌ | - | Sakshi
Sakshi News home page

అడుగంటిన కోయిల్‌సాగర్‌

Jul 9 2026 6:53 AM | Updated on Jul 9 2026 6:53 AM

దేవరకద్ర: వానాకాలం సీజన్‌ ప్రారంభమైన ఐదు వారాలు గడిచినా కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆకాశం వైపు వెర్రిచూపులు చూడాల్సి వస్తున్నది. ప్రస్తుతం వర్షం లేక భూములన్నీ బీళ్లుగా కనిపిస్తున్నాయి. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 9.3 అడుగులకు పడి పోయింది. పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. వానాకాలంలో ప్రారంభంలోనే వర్షాలతో కానీ, జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా గానీ ప్రాజెక్టులోకి నీరు వచ్చేది. దీంతో ఆయకట్టు భూములకు నీటిని వదలడం వల్ల సమృద్ధిగా పంటల సాగు కొనసాగేది. ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి మరో 12 అడుగుల మేర నీరు చేరితేనే ఆయకట్టుకు నీటిని వదిలే అవకాశం ఉంది. వర్షాలు బాగా కురిస్తే తప్ప ప్రాజెక్టుకు నీరు అందే అవకాశం కనిపించడం లేదు.

జూలైలోనే నీటి విడుదల..

మూడేళ్లుగా జూలైలోనే ఆయకట్టుకు నీటిని వదిలారు. 2023లో ప్రాజెక్టుకు జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించడంతో ప్రాజెక్టులో 24 అడుగుల మేర నీటి మట్టం చేరింది. వానాకాలంలో మూడు నెలల పాటు నీటిని వదలడంతో దాదాపు 35 వేల ఎకరాల మేర సాగు చేశారు. 2024లో వర్షాలు బాగా కురవడంతో జూలై నాలుగో వారం నుంచి నీటి విడుదల కొనసాగించారు. ఎత్తిపోతల లక్ష్యం మేరకు దాదాపు 36 వేల ఎకరాల మేర వరి పంటలు సాగు చేశారు. 2025లో సైతం భారీ వర్షాలు కురిసాయి. మే, జూన్‌, జూలైలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు పాత ఆలుగుస్థాయికి చేరింది. దీంతో జూలైలోనే నీటిని విడుదల చేసి పంటలకు అందించారు. గతేడాది పంటలకు వచ్చే నీరు ఎక్కువ కావడంతో కోయిల్‌సాగర్‌ నీటిని గొలుసుకట్టు చెరువులకు మళ్లించాల్సి వచ్చింది. పంటలు కూడా రికార్డుస్థాయిలో రైతులు పండించారు. కాగా.. వానాకాలం సాగుకు రైతులు అంతా సిద్ధం చేసుకున్నా వానదేవుడు కరుణించకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. ఆగష్టు వరకు మరికొంత సమయం ఉండడం వల్ల నాట్లకు ముందు ఉండే వ్యవసాయ పనులను చేసుకుంటున్నారు. బోరుబావుల కింద ఇప్పటికే నారుమళ్లను వేసుకున్నారు.

చేరని ఎత్తిపోతల లక్ష్యం..

కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు సాగు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజెక్టు పరిధిలో దేవరకద్ర, ధన్వాడ, మరికల్‌, చిన్నచింతకుంట మండలాల పరిధిలో పాత ఆయకట్టు 12 వేల ఎకరాలుగా ఉండేది. ఎత్తిపోతల లక్ష్యం 38,250 ఎకరాలు కాగా.. పాత ఆయకట్టు కలుపుకుని పూర్తి సాగు 50,250 ఎకరాలకు చేరింది. ఎత్తిపోతల ప్రారంభమైన తర్వాత పూర్తిస్థాయి లక్ష్యం ఎప్పుడూ చేరలేదు. మూడేళ్లుగా వానాకాలంలో 35 వేల ఎకరాల వరకు సాగు అవుతుంది. ఇక యాసంగిలో 12 వేల ఎకరాల పాత ఆయకట్టుకే పరిమితమైంది. కాల్వల పొడిగింపు పనులు పెండింగ్‌లో ఉండడం, పిల్ల కాల్వలు సక్రమంగా లేకపోవడం వల్ల సాగు లక్ష్యం సాధ్యం కావడం లేదు.

ఆశ, నిరాశల మధ్య రైతన్న!

ప్రస్తుతం ప్రాజెక్టులో

9.3 అడుగుల వరకే నీరు

పంపులు నడిచినా అందని నీరు.. ప్రారంభం కానీ ఆయకట్టు సాగు

వర్షాలు పడితేనే సమస్యకు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement