లారీ, బైక్‌ ఢీకొని ఒకరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ, బైక్‌ ఢీకొని ఒకరి దుర్మరణం

Mar 15 2026 6:05 AM | Updated on Mar 15 2026 6:05 AM

కృష్ణా: లారీ, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన ఘటన కృష్ణా మండలం టైరోడ్డులో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీద్‌ వివరాల మేరకు.. కర్ణాటకలోని ఇబ్రహీందొడ్డి గ్రామానికి చెందిన ఖతల్‌ (50), మరో వ్యక్తి బైక్‌పై వస్తుండగా.. టైరోడ్డు వద్ద ప్రమాదవశాత్తు లారీ, బైక్‌ డీకొన్నాయి. ప్రమాదంలో ఖతల్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. గాయపడిన వ్యక్తిని రాయచూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కారు ఢీకొని వృద్ధుడి మృతి

కల్వకుర్తి రూరల్‌: మండలంలోని తర్నికల్‌ గేట్‌ సమీపంలో శనివారం కారు ఢీకొట్టిన ఘటనలో అదే గ్రామానికి చెందిన మంగలి ఎల్లప్ప(80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన ఎల్లప్ప మోకాళ్ల నొప్పుల మందుల కోసం కల్వకుర్తికి వెళ్లి తిరిగి వస్తూ సుమారు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తర్నికల్‌ స్టేజి వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా నాగర్‌కర్నూల్‌ నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సతీష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లింగమ్మ, ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

చేపల వేటకు వెళ్లి..

శవమై తేలాడు

నాగర్‌కర్నూల్‌ క్రైం: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకోగా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ గోవర్ధన్‌ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని బొందలపల్లి గ్రామానికి చెందిన గుంటి గిరి(42) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని నల్లకుంట చెరువులో చేపల పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతదేహం శనివారం ఉదయం నీటిపై తేలియాడటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు మహేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఉరేసుకుని వ్యక్తి

ఆత్మహత్య

నవాబుపేట: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మరికల్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నడిమింటీ శేఖరయ్య (59) భార్య అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా బాధపడేవాడు. ఈ క్రమంలో శనివారం తన వ్యవసాయ పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు మల్లికార్జున్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు.

వివాహిత ఆత్మహత్య

ఉప్పునుంతల: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉప్పునుంతల బీసీ కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి వివరాల మేరకు.. బీసీ కాలనీకి చెందిన మెడమోని శిరీష (28) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై తన వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి భర్త మల్లేష్‌ హైదరాబాద్‌లో బెటాలియన్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తండ్రి పర్వతాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

60 ఏళ్ల వృద్ధురాలు

నేత్రదానం

భూత్పూర్‌: మండలంలోని కర్వెనకు చెందిన వడ్డె వెంకటమ్మ(60) శనివారం అనారోగ్యంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న జూనియర్‌ రెడ్‌క్రాస్‌ కో–ఆర్డినేటర్‌ కందుకూర్‌ అశోక్‌కుమార్‌ వారి కుటుంబ సభ్యులను సంప్రందించారు. కందుకూర్‌ అశోక్‌కుమార్‌ వడ్డె వెంకటమ్మ కుమారుడైన వడ్డె నర్సింహతో మాట్లాడి నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చారు. వడ్డె వెంకటమ్మ నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ల్యాబ్‌కు దానం చేశారు. నేత్రదానం చేయుటకు ముందుకొచ్చిన వడ్డె నర్సింహను సర్పంచ్‌ మాసగౌడ్‌, ఉపసర్పంచ్‌ మల్లేశ్‌, వార్డు సభ్యుడు శ్రీనివాస్‌, కో–ఆర్డినేటర్‌ కందుకూర్‌ అశోక్‌ కుమార్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement