మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఇరాన్ దేశంపై అమెరికా దురహంకార ధోరణితో యుద్ధం చేస్తుందని, యుద్ధాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ వివిధ దేశాలపై అమెరికా చూపుతున్న దురహంకారాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని ప్రధాని నరేంద్రమోదీ ఖండించడంతో పాటు చొరవ తీసుకొని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇరాన్‌లో ఉన్న నిల్వలను అమెరికా కొల్లగొట్టేందుకు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుందని ఇరాన్‌పై దాడి చేసి ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పాఠశాలపై దాడి చేసి 150 మంది విద్యార్థులను అమెరికా పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇండియాలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. 15 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసినా పంపిణీ జరగడం లేదన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. ఇజ్రాయిల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై చేస్తున్న యుద్దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులు, బడుగు బలహీన వర్గాలపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ వీబీజీ రాంజీ చట్టాన్ని తెచ్చిందని, రాష్ట్రాలపై భారాన్ని మోపుతూ ఉపాధి కూలీల పొట్టకొట్టేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వన సంఘాన్ని ఎన్నుకున్నారు. చైర్మెన్‌గా డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా జేపీఎన్‌సీఈ కళాశాల చైర్మన్ రవికుమార్, కోశాధికారిగా ఎ.రాములు, ఉమ్మడి జిల్లా వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వాన సంఘానికి ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.సాగర్, సభ్యులు జయలక్ష్మి, భూపాల్, రాష్ట్ర మహిళా కన్వీనర్ బి.పద్మ, నాయకులు కిల్లెగోపాల్, ఎండీ జబ్బార్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.


