ఐదు దశాబ్దాల బంధం.. ఐదు గంటల్లో ఎడబాటు! | - | Sakshi
Sakshi News home page

ఐదు దశాబ్దాల బంధం.. ఐదు గంటల్లో ఎడబాటు!

Feb 6 2026 11:52 AM | Updated on Feb 6 2026 11:52 AM

ఐదు దశాబ్దాల బంధం.. ఐదు గంటల్లో ఎడబాటు!

ఐదు దశాబ్దాల బంధం.. ఐదు గంటల్లో ఎడబాటు!

చావులోనూ వీడని తోడు

అనారోగ్యంతో భార్య, ఆవేదనతో భర్త మృతి

వనపర్తి జిల్లా దుప్పల్లిలో విషాదం

మదనాపురం: మూడు ముళ్లు.. ఏడడుగులతో ఒక్కటైన ఆ బంధం.. ఐదు దశాబ్దాలపాటు అన్యోన్యంగా సాగింది. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మృతిచెందిన.. కొద్దిసేపటికే ఆవేదనతో భర్త సైతం లోకాన్ని వీడిన విషాదకర సంఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని దుప్పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. దుప్పల్లి గ్రామానికి చెందిన గుట్టకాడి అల్లెన్న(68), గుట్టకాడి కుర్మక్క(60) దంపతులు ఐదు దశాబ్దాలుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుర్మక్క గురువారం ఉదయం ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 50 ఏళ్లకుపైగా తన కష్టసుఖాల్లో పాలుపంచుకున్న ఇల్లాలు లేని లోకాన్ని ఆయన ఊహించుకోలేకపోయారు. భార్య పార్థివదేహం ముందు కన్నీరుమున్నీరుగా విలపించిన అల్లెన్న భార్య మరణించిన కేవలం ఐదు గంటల వ్యవధిలోనే తీవ్రమైన మనోవేదనతో గుండె పోటుకు మృతిచెందారు. ప్రాణం ఉన్నప్పుడే కాకుండా.. పోయాక కూడా తోడుండాలని ఆమె వెంటే వెళ్లిపోయారు అంటూ గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే రోజు.. కొద్దిగంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సాధారణంగా పెళ్లి మంత్రాల్లో జీవితాంతం తోడుంటాం అని ప్రమాణం చేస్తారు. కానీ, ఈ దంపతులు మరణానంతరం కూడా తోడుంటాం అని నిరూపించారని పలువురు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement