పేదల సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్సే
స్టేషన్ మహబూబ్‌నగర్: పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్ బిల్లు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మహబూబ్‌నగర్ పాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరారు. ఎన్నికల్లో ఒక్క ఓటు చాలా కీలకమని, పోల్ మేనేజ్‌మెంట్ అవసరమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు తెలుగు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి వీరేష్‌కుమార్, బురానప్ప, నరసింహ, శ్రీనివాసులు, వనపర్తి జిల్లా అధ్యక్షుడు భానుప్రకాశ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


